సైబర్ సిటీ న్యూస్ - స్పెషల్ స్టోరీస్ / హైదరాబాద్ : ప్రకృతి కవి, ప్రజా కవిగా పిలవబడే అందెశ్రీ ఇక లేరని తెలియడంతో సాహితీ లోకం కన్నీటి సంద్రంలో మునిగింది. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు అంటూ మానవతా విలువలను గుర్తుచేస్తూ గొంతెత్తి పాడిన మహాకవి నిజ జీవితం నుంచి మాయమైపోయారు. గుండెపోటుతో మృతి చెందినట్లు గాంధీ ఆసుపత్రి వైద్యులు సోమవారం ఉదయం వెల్లడించారు. వరంగల్ జిల్లా, జనగాం(ప్రస్తుతం సిద్దిపేట జిల్లా) సమీపంలోని రేబర్తి గ్రామంలో 1961 జూలై 18 న జన్మించిన అందెశ్రీ అసలు పేరు అందే ఎల్లయ్య. అనాధగా పెరిగిన ఆయనకు ఎలాంటి చదువు లేదు. పశువుల కాపరిగా పనిచేస్తూ పాటలు పాడుతుండగా స్వామి శంకర్ మహరాజ్ అతన్ని చేరదీశాడు. నారాయణమూర్తి విప్లవాత్మక సినిమాల విజయాల వెనక అందెశ్రీ పాటలు ఉన్నాయి. అశువు కవిత్వం చెప్పడంలో ఆయన దిట్ట. తెలంగాణ, ప్రకృతి తదితరు అంశాలపై ఆయన అనేక గీత రచనలు చేశారు. జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం అంటూ తెలంగాణ మాతృ గీతం రచించారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కోటి రూపాయల నగదు పురస్కారాన్ని అందుకున్నారు. చదవడం రాయడం తెలియని ఆయన సహజ కవిగా రాణించి తెలంగాణ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారు.
జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం (తెలంగాణ మాతృ గీతం), మాయమైపోతున్నాడమ్మో మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, జన జాతరలో మన గీతం, గలగల గజ్జల బండి, కొమ్మ చెక్కితే బొమ్మరా, వెళ్ళిపోతున్నావా తల్లి తదితర గీతాలు తెలుగు ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సహజ కవిగా సమాజంపై చెరగని ముద్ర వేసిన అందెశ్రీ కి అనేక అవార్డులు దక్కాయి. 2014లో భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రతిపాదించింది. కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ను బహూకరించింది. అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్, వాషింగ్టన్ డిసి గౌరవ డాక్టరేట్ తో పాటు లోక కవి అన్న బిరుదు ఇచ్చి సన్మానించింది. వంశీ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ దాశరథి సాహితీ పురస్కారం, డాక్టర్ రావూరి భరద్వాజ, రావూరి కాంతమ్మ ట్రస్ట్ రావూరి భరద్వాజ సాహితీ పురస్కారాన్ని అందజేసింది. 2006లో గంగ సినిమాకు పాటలు రాసినందుకు నంది పురస్కారం అందుకున్నారు. దాశరధి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం, లోక్ నాయక్ పురస్కారం, సుద్దాల హనుమంతు - జానకమ్మ జాతీయ పురస్కారాలను అందుకున్నారు. ఎర్ర సముద్రం సినిమా కోసం మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు అనే పాటను రచించడంతో ఆంధ్రప్రదేశ్ లోని విశ్వవిద్యాలయాలు సిలబస్ లో చేర్చారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో కవిగా మహోన్నతమైన పాత్రను పోషించారు. తెలంగాణ ధూంధాం కార్యక్రమ శిల్పిగా 10 జిల్లాల ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన వారిలో అందెశ్రీ ప్రముఖుడు. అందెశ్రీ రచించిన జయ జయహే తెలంగాణ గీతాన్ని తెలంగాణ ప్రజలు ముక్కోటి గొంతుకులతో ప్రార్ధన గీతంగా పాడుకుంటున్నారు. తెలంగాణ ఆత్మను ఆవిష్కరించిన రచయిత అందెశ్రీ తిరిగిరాని లోకాలకు వెళ్లారు. లాలాగూడ ఇంట్లో కుప్పకూలిపోవడంతో కుటుంబ సభ్యులు హుటా హుటిన గాంధీ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయారని వైద్యులు ద్రవీకరించారు.
Cyber City NewsAdmin