సైబర్ సిటీ న్యూస్ - స్థానికం / హైదరాబాద్ : గాలిలో వేలాడుతున్న చైనా మాంజా ఓ యువకుడికి తీవ్ర గాయం చేసింది. పోలీసులు అవగాహన కల్పించిన తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తూ కొందరు గుట్టుచప్పుడు కాకుండా చైనా మాంజాతో పతంగులు ఎగరవేస్తున్నారు. తెగిపోయిన మాంజా బుటాక్నికల్ గార్డెన్ కొత్తగూడ ఫ్లైఓవర్ పై వేలాడుతూ ఉండగా బైక్ పై వెళుతున్న సూర్య తేజకు తీవ్ర గాయం అయింది. విశాఖపట్నం పెద్ద వాల్తేర్ (33) మియాపూర్లో నివాసం ఉంటున్నాడు. గచ్చిబౌలిలోని వాసవి స్కై బిల్డింగ్ లో ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా బొటానికల్ ఫ్లైఓవర్ పై ఎస్ ఎల్ ఎన్ టర్మినస్ వద్ద వేలాడుతున్న మాంజా ఎడమ భుజానికి తాకింది. ఏమైందో చూసుకునే లోపే భుజం నుంచి తీవ్ర రక్తస్రావం కనిపించడంతో సూర్యతేజ బైక్ ఆపి స్నేహితులకు ఫోన్ చేశాడు. భుజానికి తీవ్రమైన గాయం కావడంతో స్నేహితులు విశాల్, శివ హుటాహుటిన మాదాపూర్ లోని యశోద హాస్పిటల్ కు తరలించారు.
పెద్ద గాయం కావడంతో అక్కడ డాక్టర్లు సర్జరీ చేసి చికిత్స అందిస్తున్నారు. కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు గుర్తులేని వ్యక్తులపై గచ్చిబౌలి పిఎస్ లో కేసు నమోదు అయింది. చైనా మాంజా విక్రయించిన, పతంగులు ఎగరవేసేవారు చైనా మాంజను వాడిన చర్యలు తప్పవని గచ్చిబౌలి పోలీసులు హెచ్చరించారు.
Cyber City NewsAdmin