సైబర్ సిటీ న్యూస్ - స్థానికం / విశాఖ పట్నం : మోంథా తుఫాన్ కెరటంలా దూసుకొస్తుంది. ఆంధ్రప్రదేశ్లోని తీర ప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి. రాగల 24 గంటల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమయింది. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టేందుకు ఎన్ డి ఆర్ ఎఫ్, ఎస్ డి ఆర్ ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉంచింది. నెల్లూరు ,ప్రకాశం ,తిరుపతి, చిత్తూరు ,అన్నమయ్య ,అనంతపురం ,కర్నూలు ,నంద్యాల, వైఎస్ఆర్ కడప జిల్లాలలో ఫ్లాష్ ఫ్లడ్స్ కారణంగా క్లౌడ్ బ్రస్టు అయ్యే అవకాశాలు ఉన్నాయి.
విశాఖ, అల్లూరి, అనకాపల్లి, విజయనగరం, మన్యం, శ్రీకాకుళం, కాకినాడ, కోనసీమ ఉభయగోదావరి, కృష్ణ, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, గుంటూరు, ప్రకాశం జిల్లాలను రెడ్ అలర్ట్ గా ప్రకటించారు. నెల్లూరు, నంద్యాల, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య , తిరుపతి జిల్లాలను ఆరంజ్ అలర్ట్ గా ప్రకటించారు. నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతం మధ్య తుఫాన్ కేంద్రీకృతమై ఉంది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.కాకినాడకు 570 కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతమైనట్లు తెలుస్తోంది. మంగళవారం కాకినాడ పరిసరాల్లో తుఫాను తీరం దాటే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ఈస్ట్ కోస్ట్ రైల్వే పలు రైళ్ళు రద్దు చేసింది.
Cyber City NewsAdmin