సైబర్ సిటీ న్యూస్ - స్థానికం / హైదరాబాద్ : రంగనాథ స్వామి దేవుని మన్యంలో రోడ్డు కోసం ఓ బిల్డర్ కాసుల వల విసిరాడు. దేవుని మాన్యాన్ని కాపాడాల్సిన నాయకులు ఒక్కరొక్కరుగా బిల్డర్ వేసిన వలలో చిక్కారు.రూ.20 వేల నుంచి లక్ష వరకు దండుకుంటున్నారు. కొద్ది రోజులుగా శ్రీ రంగనాథ స్వామి సాక్షిగా గోపన్ పల్లి లో జరుగుతున్న ఈ తంతు అందరిని విస్మయానికి గురిచేస్తుంది. ఏ ఒక్కరిని కదిపిన డబ్బు పంపిణీ విషయం గురించి చర్చించుకుంటున్నారు. గోపనపల్లి సర్వేనెంబర్ 268 లో శ్రీ రంగనాథ స్వామి కి చెందిన 13 ఎకరాల భూమి ఉంది. దేవాదాయ శాఖ ఆధీనంలో ఉన్న ఆ భూమిలో ఉస్మాన్ నగర్ లో బహుళ అంతస్తుల నిర్మాణం చేపడుతున్న ఓ బడా బిల్డర్ కన్నేశాడు. తెల్లాపూర్ వైపు ఉన్న రోడ్డును చూపించి అనుమతులు తెచ్చుకున్నప్పటికీ దేవుని మాన్యం నుంచి రోడ్డు వేస్తే ఐటీ కారిడార్ కు మార్గం సుగమం అవుతుంది. దీంతో రియల్ వ్యాపారానికి మరింత లాభదాయకంగా సాగే అవకాశం ఉంది. ఆలోచన వచ్చిందే తడవు అన్నట్లుగా గత సెప్టెంబర్ 13న అర్ధరాత్రి రంగనాథ స్వామి దేవుని మన్యం స్థలంలో సిమెంట్ రోడ్డును వేశాడు. మరుసటి రోజు దేవాదాయ శాఖ అధికారులు రోడ్డును తొలగించి శిథిలాలను అక్కడే వదిలి వెళ్లారు. వాహనాల రాకపోకలు చేయకుండా రెండువైపులా రోడ్డు గడ్డంగా గొయ్యి తీశారు. ఆ తరువాత కొద్ది రోజుల్లోనే వలస కూలీలను సాటుగా చూపి ప్రైవేట్ వ్యక్తులు రోడ్డు శిధిలాలను తొలగించి చదును చేశారు. మూడు నెలల నుంచి రాకపోకలు యదేచ్చగా సాగుతున్న దేవాదాయ శాఖ అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడక పోవడం విమర్శలకు తావిస్తోంది. ఆ వెంటనే గోపనపల్లికి చెందిన నాయకులకు డబ్బులు పంచేందుకు బిల్డర్ ముందుకు వచ్చాడు. లక్షల్లో డబ్బును పంపిణీ చేసి భవిష్యత్తులో రోడ్డుకు అభ్యంతరం చెప్పవద్దని మాట తీసుకున్నాడు. ఉస్మాన్ నగర్ కు చెందిన స్థల యజమాని, అధికార పార్టీ నాయకుడు, బడా బిల్డర్ కలిసిఎలాగైనా దేవుని మాన్యం నుంచి రోడ్డు వేస్తేనే తమ వ్యాపారం రెండింతలు గా సాగుతుందని భావించారు. శేర్లింగంపల్లి చెందిన ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతూ పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. కొద్ది రోజులుగా వారు చేస్తున్న డబ్బు పంపిణీ వ్యవహారం గోపన్ పల్లి లో హాట్ టాపిక్ గా మారింది.
తవ్వి వదిలేసిన రోడ్డును చదును చేయడం, మరో బిల్డర్ నిర్మాణంలో ఉన్న భవనం వైపు వెళ్లేందుకు దేవుని మన్యం నుంచి తాజాగా మట్టి రోడ్డు వేయడం కలకలం రేపింది. దేవుని మన్యం పై రెండువైపులా ఆక్రమణకు తెగబడుతున్న ఆ శాఖ అధికారులు పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఫిర్యాదులు వచ్చినప్పుడు మాత్రమే స్పందిస్తూ నిఘా పెట్టక పోవడం తో ఆక్రమణదారులు రెచ్చిపోతున్నారు. దేవుని మాన్యం ఇప్పటికే కొంత భాగం కబ్జాకు గురైందనే అనుమానాలు ఉన్నాయి. రోడ్డును చదును చేసినట్లు తెలియదని దేవాదాయ శాఖ ఈవో అంజయ్య తెలిపారు. రెండు రోజుల క్రితం సమాచారం వచ్చిందని, త్వరలో చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.
Cyber City NewsAdmin