సైబర్ సిటీ న్యూస్ - స్పెషల్ స్టోరీస్ / హైదరాబాద్ : గచ్చిబౌలి ప్రధాన రహదారికి ఆనుకుని పర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయిస్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లేఅవుట్ లో సంధ్యా శ్రీధరరావు నిర్మించిన పలు అక్రమ కట్టడాలను సోమవారం హైడ్రా నేలమట్టం చేసింది. లే ఔట్లో రహదారులు, పార్కులను పట్టించుకోకుండా చేపట్టిన నిర్మాణాలపై హైకోర్టు ఉత్తర్వులతో హైడ్రా చర్యలుతీసుకుంది. 40 అడుగుల రోడ్డుకు అడ్డంగా ఐరన్ ఫ్రేమ్తో నిర్మించిన 5 అంతస్తుల భవనం, మ్యాంగో ఫుడ్ కోర్టును కూడా తొలగించింది. మరో చోట 40 ఫీట్ రహదారిపై నిర్మించిన యూనో ఫుడ్ కోర్టును కూడా తొలగించి రోడ్లకు మార్గం సుగమం చేసింది. 40 ఫీట్ల రహదారిని కలిపేసి నిర్మించిన పెట్రోల్ బంక్ ను పాక్షికంగా తొలగించింది. రెండు చోట్ల 25 ఫీట్ల రహదారులపై ఏర్పాటు చేసిన 40 వరకు ఉన్న ఫుడ్ కంటైనర్లతో పాటు చైనా ఫుడ్ కోర్టులను తొలగించింది. 40 ఫీట్ల రహదారిపైకి జరిగి నిర్మించిన ఆసుపత్రి భవనం కోసం డబుల్ సెల్లార్ ర్యాంపులను కూల్చివేసింది. 7 చోట్ల రహదారులను ఆక్రమించి నిర్మించిన పలు కట్టడాలను తొలగించింది. హైకోర్టు ఆదేశాల మేరకు లే ఔట్లోని రహదారులను హైడ్రా పునరుద్ధరించనుంది.
గచ్చిబౌలిలోని ఫెర్టిలై జర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కోపరేటివ్ హౌసింగ్ సొసైటీ లే ఔట్ లో సంధ్యా కన్వెన్షన్ ఎండి శ్రీధరరావు ఆక్రమణలను హైకోర్టు తప్పు పట్టింది. రహదారులు ఆక్రమించి పలు నిర్మాణాలు చేపట్టడాన్ని సీరియస్ గా పరిగణించింది. లేఔట్ లోని రోడ్లను పునరుద్ధరించాలని ఉత్తర్వులు జారీ చేసింది. 1981లో గచ్చిబౌలి సర్వేనెంబర్ 124, 125 పార్ట్ లో నీ 20 ఎకరాల పరిధిలో వేసిన లేఔట్ ప్లాట్లుండగా 119 ప్లాట్లను శ్రీధర్ రావు కొనుగోలు చేశారు. లేఔట్ స్వరూపాన్ని మార్చి ఇస్తానుసారంగా రోడ్లను ఆక్రమించి అనుమతులు పొందారు. గతంలో ఆక్రమణలు తొలగించడంపై సంధ్యాశ్రీధరరావు హైకోర్టును ఆశ్రయించగా హైకోర్టు రోడ్లను పునరుద్ధరించడం అవసరమని చెప్పడం గమనార్హం. తమ ప్లాట్లకు వెళ్లేందుకు రోడ్డు లేకుండా చేశారని ప్లాట్ల యజమానులు శ్రీధర్ రావు పై హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దీంతో గత మే 5న హైడ్రా ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా హౌసింగ్ సొసైటీలో శ్రీధర్ రావు చేపట్టిన అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. 1981లో వేసిన లేఔట్ లో ఉన్న రోడ్లను మార్చాలని గుర్తించి పాత రోడ్లకు మార్కింగ్ ఇచ్చింది. రోడ్లకు అడ్డంగా నిర్మాణాలకు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని హైడ్రాధికారులు జిహెచ్ఎంసి కి లేఖ రాశారు. నిబంధనలను లెక్కచేయకుండా శ్రీధర్ రావు నాలుగు నెలలుగా యధేచ్ఛగా నిర్మాణాలు చేపట్టారు. ప్లాట్ల యజమానులకు రోడ్లు లేవని మొత్తుకున్న పట్టించుకోకపోవడంతో మరోసారి బాధితులు హైడ్రా అధికారులను కలిశారు. మరోపక్క హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో తాజాగా హైడ్రా పెద్ద మొత్తంలో శ్రీధర్ రావు అక్రమ నిర్మాణాలను కూల్చి వేసింది.
Cyber City NewsAdmin