సైబర్ సిటీ న్యూస్ - స్పెషల్ స్టోరీస్ / హైదరాబాద్ : ఇది ఆధునిక ప్రపంచం. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటేనే అంత సవ్యంగా నడుస్తుందని అనుకునే వేళ. చాయ్, బిస్కట్, చాక్లెట్ కోనాలన్నా స్మార్ట్ అవసరం ఉంది. చదువు రాని వారు కూడా స్మార్ట్ ఫోన్ లో రీల్స్ , చూస్తూ, పాటలు వింటూ సేదదీరుతున్నారు. రెండేళ్ల పిల్లల నుంచి వృద్ధుల వరకు స్మార్ట్ ఫోన్ లేనిదే గడవడం లేదు. ఇప్పుడు అంతా స్మార్ట్ ఫోన్ పైనే నడుస్తోంది. స్మార్ట్ ఫోన్ లేనిదే ఎవరూ ఉండలేకపోతున్నారు. అన్ని పనులు ఇప్పుడు ఫోన్ పైనే జరిగిపోతున్నాయి. అందుకే.. స్మార్ట్ ఫోన్ మనిషి జీవితంలో భాగమైపోయింది. ఇప్పుడు ప్రపంచం 6జీ వైపు పరుగుపెడుతున్న వేళ. ప్రపంచం పరిస్థితి ఇలా ఉంటే.. ఆ ఊరిలో మాత్రం అందుకు పూర్తి భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయ్. అక్కడ మహిళలు స్మార్ట్ ఫోన్ల వాడకంపై నిషేధం విధించారు. ఆ ఊరిలోని మహిళలు, బాలికలు ఎవరూ స్మార్ట్ ఫోన్ వాడటానికి వీల్లేదు. ఈ మేరకు ఆ ఊరి పెద్దలు హుకుం జారీ చేశారు
రాజస్థాన్ రాష్ట్రం జలోర్ జిల్లాలో మహిళలు స్మార్ట్ ఫోన్ వాడకుండా నిషేధం విధించారు. వారు కేవలం కీ ప్యాడ్ ఫోన్లు మాత్రమే వాడాలని ఆదేశించారు. ప్రపంచమంతా 6జీ వైపు పరుగులు పెడుతుండగా రాజస్థాన్‌లోని జలోర్ జిల్లాలోని 15 గ్రామాలలో మహిళలను కీప్యాడ్ ఫోన్ల యుగానికి తిరిగి వెళ్లమని కోరుతున్నారు. చౌదరి వర్గానికి చెందిన సుంధమాతా పట్టి పంచాయతీ కీలక ఆదేశాలు ఇచ్చింది. మహిళలు, బాలికలు స్మార్ట్‌ఫోన్‌ల వాడకంపై నిషేధం విధించింది. మొబైల్ వ్యసనం, పిల్లల కంటిచూపుపై స్క్రీన్ల ప్రభావంపై ఆందోళనలను పేర్కొంటూ కమ్యూనిటీ పెద్దలు ఈ నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది. కేవలం మహిళలు, బాలికల పై నిషేధం విధించడం వేరే కారణాలు ఉండవచ్చనే చర్చ జరుగుతుంది. ఈ నిబంధన 2026 జనవరి 26 నుండి అమల్లోకి రానుంది. ఈ నిర్ణయం ప్రకారం, మహిళలు కేవలం కీప్యాడ్ ఫోన్లలను మాత్రమే ఉపయోగించడానికి అనుమతి ఉంటుంది. పెళ్లిళ్లకు, సామాజిక సమావేశాలకు లేదా పొరుగు ఊర్లు, బిందువుల ఇంటికి వెళ్ళినప్పుడు కూడా మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడానికి ఇకపై అనుమతి ఉండదు. స్థానిక కమ్యూనిటీ పెద్దలు ఇచ్చిన ఆదేశాలు చర్చనీయాంశంగా మారాయి. స్మార్ట్ ఫోన్లు వాడకుండా నిషేధం ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఈ ఆధునిక కాలంలో ఇలాంటి నిర్ణయాలు సరికాదంటున్నారు. మహిళలు, బాలికలపై వివక్ష చూపటం ఏంటని విమర్శిస్తున్నారు. మరికొందరు మాత్రం ఈ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ల వినియోగం బాగా పెరిగిపోయిందని, వ్యసనంగా మారిందని, దాని వల్ల చాలా అనర్థాలు జరుగుతున్నాయని, కంటి చూపు సమస్యలు వస్తున్నాయని, ఇది చక్కని నిర్ణయం అని సమర్థించే వాళ్లూ ఉన్నారు.
Cyber City NewsAdmin