సైబర్ సిటీ న్యూస్ - క్రైమ్ / శ్రీకాకుళం : శ్రీకాకుళంలోని కాశీబుగ్గలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ తొక్కిసలాటలో ఇప్పటివరకు దాదాపు పదిమంది మృతి చెందారని, మరో 20 మందికి గాయాలైనట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కార్తీక మాసం ఏకాదశి కావడంతో కాశిబుగ్గలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచి భక్తుల తాకిడి మొదలైంది. ఉన్నట్టుండి భక్తుల సంఖ్య అంతకంతకు పెరిగింది. రీలింగ్ విరిగిపోవడంతో భక్తులు కింద పడిపోయారు. దీంతో తోపులాట, తొక్కిసలాట జరిగింది. మహిళలు చిన్నారులు కింద పడిపోవడంతో ఊపిరి ఆడక చనిపోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.
కాశీబుగ్గలోనే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏకాదశి పురస్కరించుకొని నిర్వాహకులు 3000 మంది భక్తుల కోసం ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తుంది. కార్తీక మాసం ఏకాదశి కావడంతో శనివారం దాదాపు 25 వేల మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం వచ్చారు. సరైన ఏర్పాట్లు చేయకపోవడం, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడంతో ప్రమాదం చోటుచేసుకుంది. మంత్రి అచ్చన్న నాయుడు, మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు ఘటనా స్థలంలో బాధితులను పరామర్శించారు. ఇది ఇలా ఉంటే కాశీబుగ్గలోనే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో ఉందని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ ప్రకటించింది. ఆలయం ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉన్న భక్తులు పెద్ద ఎత్తున వచ్చినప్పుడు ఏర్పాట్లు చేస్తే బాధ్యత ప్రభుత్వం పై ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు.
Cyber City NewsAdmin