సైబర్ సిటీ న్యూస్ - క్రైమ్ / హైదరాబాద్ : చేవెళ్లలోనే మీర్జాగూడ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తాండూర్ నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా వస్తున్న కంకర లోడ్ తో టిప్పర్ ఢీ కొట్టింది. టిప్పర్ బస్సు పైకి వరగడంతో కంకర తో బస్సు నిండిపోయింది. కొంతమంది ప్రయాణికులు కంకరలో కూరుకుపోవడంతో కొందరు ఊపిరాడక స్పాట్ లోనే చనిపోయారు. మరి కొంతమంది ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. 25 మంది మృతి చెందగా మరో 32 మంది గాయపడ్డట్టుగా తెలుస్తుంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. చేవెళ్లలోనే ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాలను ఉంచారు. అక్కడే పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించనున్నారు. క్షతగాత్రులకు అక్కడే చికిత్స అందిస్తున్నారు. తీవ్రంగా గాయపడ్డ వారిని హైదరాబాద్ కు తరలించి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు
తాండూరు డిపోకు చెందిన బస్సు ఉదయం నాలుగు గంటల 40 నిమిషాల సమయంలో హైదరాబాద్ కు బయలుదేరింది. దాదాపు 70 మంది ప్రయాణికులు బస్సులు ఉన్నట్లు తెలుస్తోంది. చేవెళ్ల సమీపంలోని మీర్జాగూడ వద్ద ఎదురుగా వస్తున్న కంకర లోడ్ టిప్పర్ ఉదయం 6.15 గంటలకు ఢీ కొట్టింది. కంకర పూర్తిగా బస్సులో పడిపోవడంతో ప్రయాణికులు తీవ్ర గాయాలు. మృతులతో పాటు క్షతగాత్రులను పోలీసులు ఎస్డిఆర్ఎఫ్ బృందాలు బయటికి తీశాయి. ప్రయాణికులతో పాటు ఆర్టీసీ బస్సు, టిప్పర్ డ్రైవర్లు మృతి చెందారు. బస్సులో ఉద్యోగులు, విద్యార్థులు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. ఎల్లయ్య అనే వ్యక్తికి చెందిన ముగ్గురు కూతుళ్లు ఈ బస్సు ప్రమాదంలో మృతి చెందారు. చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రి వద్ద బంధువుల రోదనలు మిన్నంటాయి. హైదరాబాద్ నుంచి బీజాపూర్ హైవేగా మార్చినప్పటికీ రోడ్డును విస్తరించకపోవడంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు ఇరుకుగా ఉండడం, లోతైన గుంత ఉండడంతోనే ప్రమాదం జరిగినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య ఘటనా స్థలానికి వెళ్లగా నిరసన వ్యక్తం చేశారు. ఘటనా స్థలాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్, అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తదితరులు పరామర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు 7 లక్షలు, క్షతగాత్రులకు 2 లక్షలు ఎక్స్ గ్రేషియో ప్రకటించింది. మీర్జాగూడ ప్రమాద ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. చేవెళ్ల ప్రమాదం ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.
Cyber City NewsAdmin